Wednesday, October 02, 2013

నాన్న

నీ మీద చాలా కోపంగా ఉంది. నువ్వు నాకు ఏమీ కొనడం లేదు. నీ గురించి ఆ రోజు రాత్రి చాలా సేపు నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉన్నాను. అప్పుడే సందు తలుపు తెరిచి సైకిల్ పెడుతున్న చప్పుడయింది. వెంటనే లేచి వెనుక తలుపు తెరిచాను. ఆత్రం నిండిన కళ్ళతో నీ చేతిలోకి చూసాను, ఏవో సంచులు కనిపించాయి. నాన్నా తెచ్చావా? ఇంకా సంచులు తెరవకుండానే అడిగాను. ఈ రోజు ఖచ్చితంగా తెస్తానని మూడు రోజుల క్రితమే చెప్పావు. 'నీ కోసం కోడి పలావు తెచ్చాను ముందు ఇది తిను' అన్నావు. కొద్ది కొద్దిగా అనుమానం మొదలయ్యింది నాలో, 'నువ్వు తెచ్చావో లేదో చెప్పు' అని మళ్ళీ అడిగాను. ఇంకా రాలేదన్నాడురా, ఇంకో రెండ్రోజుల్లో... ఇంక నీ మాటలు పూర్తి కాకుండానే నా కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతూ ఇంకేమీ వినిపించుకోకుండా ఎంత వేగంగా వెళ్లి తలుపు తెరిచానో అంతే వేగంగా వెనక్కి వచ్చి మంచం మీద ముసుగు తన్నాను.

"చిన్నా, రామ్మా తిందాము నాకు బాగా ఆకలవుతోంది, నువ్వు తింటేనే నేను తింటాను" అని నువ్వు ఎంతగా బతిమాలుతున్నా ముసుగు తియ్యకుండా బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకునే ఉన్నాను.

బుజ్జగించావు - అదిలించాను
చక్కిలిగిలి పెట్టావు - కోపంగా నవ్వాపుకున్నాను
గట్టిగా లాగావు - విదిలించుకున్నాను
ఎన్ని చేసినా నేను మాత్రం ముసుగు తియ్యలేదు, నువ్వు తినలేదనే విషయాన్నే పట్టించుకోలేదు.

ఇది జరిగి ఇరవై సంవత్సరాలయ్యుంటుంది. నా వల్ల నువ్వు తినలేదనే బాధ ఉంది.
ఇప్పటికీ కాంపస్ బాక్స్ కొనలేదనే కోపం ఆ బాధని జయించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 
నీకు గుర్తుందా నాన్నా?

Labels:

Friday, April 17, 2009

అన్నయ్యా కాంబినేషనామా అన్నయ్యకి తినడమంటే చాలా ఇష్టం. సన్నగా రివటలా ఉన్నాడు వీడేం తింటాడు అనుకుంటారు చూసినవాళ్ళు. కానీ చక్కగా తింటాడు. కాంబినేషన్స్ చేసుకుని తినడమంటే వల్లమాలిన ఇష్టం. ఈ ఇష్టమే క్రమంగా అభిమానంగా మారి అది కాస్తా వెర్రిగా అభివృద్ధి చెంది చివరికి వేయి తలలతో వికటాట్టహాసం చేయడం మొదలెట్టింది. ఎలా అంటే ఎప్పటిలా మొన్నొక రోజు నా రూంకి భోజనానికి వచ్చి చేపల పులుసులో టమాటా సాస్ కలుపుకుని 'అద్భుతం' అన్నాడు. ఇలా అయితే నా రూంకి రావద్దు అని గట్టిగ వార్నింగిచ్చాను (అప్పటికే నా రూమ్మేట్స్ రామీ గాడు, బస్సోడు ఇద్దరూ బయటికి పారిపోయారు). సరేలే అంటూ తనతో తెచ్చుకున్న ఒక బాక్స్ తెరిచాడు. ఏంట్రా తెచ్చావ్ అంటే పెరుగులో కాంబినేషన్ కోసం కోర్నెటొ చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చాను ట్రై చెయ్ అన్నాడు. ఇలా ముదిరింది మా వాడి కాంబినేషన్స్ వెర్రి.

చెప్తే వినడు, తప్పురా అంటే ఒప్పుకోడు. పైపెచ్చు నా క్రియేటివిటీని అర్ధం చేస్కొండ్రా అనడం మొదలెట్టాడు. ఫుడ్ కాంబినేషన్స్ మీద రీసర్చ్ చేస్తాను, నా క్రియేటివిటీని పెంచుకుంటాను అని శని, ఆదివారాలు మొత్తం సిటీలో ఉన్న రెస్టారెంట్ల మీద వరుసగా దాడి చేయడం మొదలెట్టాడు. పోయిన వారం బౌల్-ఓ-చైనా అనే చైనీస్ రెస్టారెంట్ కి వెళ్లి అమెరికన్ చాప్సి అనే ఐటం చూసి చైనీస్ ఫుడ్ లో అమెరిక అనుకుని ఆర్దరిచ్చేసాడు. అది వచ్చేలోగా ఒక చికెన్ సూప్ చెప్పాడు. వచ్చిన చికెన్ సూప్ లో వీడు తీసుకెళ్ళి ఊర మిరపకాయ పచ్చడి కలుపుకుని తాగేసాడు. ఆ తర్వాత వచ్చిన అమెరికన్ చాప్సిలో చిల్లి సాసు, టమాట సాసు వేసుకుని మిగిలిన ఊర మిరపకాయ పచ్చడి కలిపేసాడు. తను తినడమే కాకుండా పక్క టేబుల్ వాళ్ళకి కూడా ఆఫర్ చేసాడు. చివర్లో వెనీలా ఐస్ క్రీమ్ చెప్పి అందులో అరటిపండుతో చేసిన స్వీట్ కలుపుకుని తిన్నాడు. అప్పటికే పక్క టేబుల్సు వాళ్ళు గుసగుసలు ఎక్కువయ్యి కొంత మంది వెళ్ళిపోయేసరికి మేనేజ్మెంట్ వాళ్ళు వీడు తిన్న వాటికి బిల్లేసి దాని మీద టాక్స్ మాత్రం కట్టించుకుని పంపేసారు. అప్పటికీ వీడి రీసర్చ్ ని ఆపక పక్కనే ఉన్న ఫ్రూట్ జ్యూస్ సెంటర్లో దూరి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చెప్పి దానికి ముందు ఫ్రూట్ సలాడ్ చేయించుకుని అందులో నిమ్మకాయ పిండుకుని తినేసి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లో స్ప్రౌట్స్ కలుపుకుని తాగేసాడు.అప్పటికిగాని వీడి కడుపులో కరడుగట్టిన క్రియేటివిటీ కరగలేదు, చివరికి అరగలేదు, నేను మెడికల్ స్టోర్ కి పరుగెట్టక తప్పలేదు.

ఒకసారి మా ఊర్లోని చుట్టాలమ్మాయి పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ లో భోజనాలంటే మా వాడి రీసర్చు, క్రియేటివిటీ అనే రెండు వికృత చేష్టలు బయటికొచ్చి విలయతాండవం చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఐటమ్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఎక్కువ కాంబినేషన్స్ ట్రై చేయచ్చని వీడి నోటి దురదాభిప్రాయం. అలాంటపుడు వాడితో భోజనం చేయడమంటే ఒకే రోజు విజయకాంత్, టి. రాజేందర్, థ్రిల్లర్ మంజూల సినిమాలు చూసినట్టే. నేనింత భయపడటానికి కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి. మచ్చుకి ఒకటి, ఇద్దరమూ కలిసి మా కామన్ ఫ్రెండ్ కూతురి మొదటి పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్ళాం. అక్కడ వీడు బంగాళాదుంప ఫ్రైలో రసగుల్లా పాకం కలుపుకోబోయాడు నేను ఆపెలోగా ఉలవ చారు కలిపేసుకున్నాడు ఇటువంటి ఎన్నో దారుణాలు ఎదురయ్యేసరికి ఫంక్షన్స్ లో వీడితో కలిసి భోజనం చేయడం మానుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మా నాన్న గారు వచ్చి భోజనం చేద్దాం పదండ్రా అనగానే మీరు వెళ్ళండి నేను తర్వాతి బంతిలో తింటాను అన్నాను. ఇక్కడ బంతి భోజనాలవడంతో మా వాడు చాలా ఫీలయ్యాడు. అన్ని వాళ్ళు పెట్టినప్పుడే తినాలి కాంబినేషన్స్ ట్రై చేయడానికి వీలవదు బఫేలో లాగా అని తను అరిటాకులో తిననని ప్లేటు అడిగి తీస్కుని అన్ని ఐటమ్స్ ఉండే టేబుల్ పక్కకు చేరాడు. ఇక మొదలెట్టాడు బూరికి చిల్లెట్టి సాంబారు పోయడం, గుత్తి వంకాయ కూరలో జాంగ్రీ పిసకడం ఇలా చివరకు పెరుగులో నెయ్యి వేయమనేంత వరకు వెళ్ళాడు. మా నాన్న గారు వెళ్లి ఇదేంట్రా అని అడిగితే సాంబారులో రస్నా కలుపుకుంటావా లేదా అంటూ మొండికేసాడు. నేనింకా తట్టుకోలేక వీడ్ని పక్కకు తీసుకెళ్ళాను. నా భోజనం అయ్యేలోగా కొబ్బరి నీళ్ళల్లో పనసతొనలు ముంచుకుని తింటున్నాడు. ఇదేంట్రా అంటే సంబారిడ్లీ లాగా అంటూ పోలిక చెప్పాడు.

ఈ విపరీత ధోరణి దగ్గరివాళ్ళకే తప్ప బయటి వాళ్లకి తెలీదు. చిన్నప్పుడు వీడితో కలిసి చదువుకున్న వెంకటరత్నం కనిపించాడు. ఏం చేస్తున్నావని అడిగితే తాజ్ బంజారాలో చెఫ్ ని అన్నాడు. అయితే ఈ సంగతి మా అన్నయ్యకి చెప్పోద్దన్నాను. కాని వీడికి ఎలా తెలిసిందో వాడితో బాగా జతకట్టాడు. వీడి ఫుడ్ ఇంట్రస్ట్ చూసి ముచ్చటపడి వెంకటరత్నంగాడు ఒక రోజు వీడ్ని తాజ్ బంజారా కిచెన్ లోకి తీస్కెళ్ళాడు. వీడ్ని పక్కన కూర్చోబెట్టి ఎవరో ఫారిన్ నుంచి వచ్చిన గవర్నమెంట్ అఫిసియల్స్ కి బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తున్నాడు. వెంకటరత్నంగాడు చూడనపుడు వాడు చేసిన సాండ్విచ్ లో వీడి కొంచెం టేస్టింగ్ సాల్ట్ కలిపాడు వెనిగర్ మిక్స్ చేసి. అంతే అప్పుడు కనిపించడమే మా వెంకటరత్నంగాడు.

ఇప్పటివరకూ కాంబినేషన్స్ అంటూ రెండు ఐటమ్స్ మాత్రమే కలిపేవాడు. కాని ఇప్పుడు క్రియేటివిటీ ఎక్కువయ్యి మల్టిపుల్ కాంబినేషన్స్ అంటున్నాడు. ఈ రోజే మా అమ్మ, నాన్న హైదరాబాద్ వచ్చారు అన్నయ్య ఫ్లాట్ కి. వెళ్లి చూద్దును కదా మా అమ్మ చేత కొబ్బరిముక్కలకి కారప్పొడి దట్టించుకుని కాఫీలో కలుపుకుని తాగుతున్నాడు.
Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Labels:

Tuesday, March 17, 2009

మూడు మూళ్లు తొమ్మిది

3339, అవును మూడు మూళ్లు తొమ్మిదే కదా . నాకు లెక్కలు ఆట్టే రావు కానీ కూడికలు మాత్రం బాగా వచ్చు... అని నమ్మకం. నాకు నచ్చితే నమ్ముతాను, నమ్మితే చెప్తాను, చెప్పిందే మర్చిపోతాను.. ఒక్కోసారి. ఒకవేళ నేను నమ్మింది తప్పైతే నాకిష్టమైన జీనియస్ ఆయినా చెప్పాలి లేదా సన్నాసైనా చెప్పాలి.

ఇప్పుడు చెప్పొచ్చేదేంటంటే నాకిష్టం లేని లెక్కల గురించి కాదు, మూడు మూళ్లు తొమ్మిది అనే నంబరు గల ఒక తెల్లటి(అక్కడక్కడా పెచ్చులూడిపోయిన) కారు గురించి. ఈ కారు యజమాని భీమరాజు. భీమరాజు వంశీ సినిమాలోని కారెక్టర్ లాగా చాలా సరదాగా ఉంటాడు. తన కారుని ఎంతో ప్రేమించి, లాలించి, కీర్తించి, బుజ్జగించి, చివరికి జాడించి తన్ని మరీ నడిపించేవాడు. ఇతను మా నాన్నకి ఫ్రెండు.

ఒకసారి మా తాతయ్యగారికి స్వయానా అన్నయ్యయిన మా పెద్ద తాతయ్యగారింటికి బయల్దేరాము. వాళ్ళ పిల్లల పిల్లలందరితో కలిసి బోళ్ళోరి పాలెంలో (బోళ్ళ వారి పాలెం) ఉండేవారు. చాలా పెద్ద ఫ్యామిలీ.
కారులో వెళ్దామని మా నాన్న భీమరాజుని రమ్మన్నారు. మర్నాడు పొద్దున్నే భీమరాజు కారుకి డీజిలు పోయించి, టైర్లకి గాలి పట్టించి మా ఇంటి ముందు వాలాడు. టీలు, టీఫినీలు కానిచ్చి బయల్దేరాం.

డ్రైవరు పక్కనుండే ముందు సీట్లో కూర్చోడమంటే మా తాతయ్యగారికి ఇష్టం. కానీ ముందు సీట్లో మా నాన్నగారిని కూర్చోమన్నాడు. 'ఎందుకురా' అంటే 'అటువైపు డోరు సరిగ్గా పడటంలేదు పట్టుక్కోర్చోవాలి' అన్నాడు. 'వార్నీ కారుని తీస్కెళ్ళి లాకూల కిందకి గెంట ఇదేం ఫిట్టింగురా' అంటే 'ఈ సారికి సర్దుక్కూర్చోండీ' అంటూ తన వైపు డోరు వేస్కుని వెనకాల డోరుకి కలిపి గుడ్డ కట్టడం మొదలెట్టాడు. 'అదెందుకురా' అంటే 'ఈ డోరు కూడా సరిగా పట్టదండి కారు తోలేటప్పుడు పట్టుకోడం ఇబ్బందవుతుందని గుడ్డ కడుతున్నా' అన్నాడు . 'ఒరేయ్ నీ కారుని లాకూల కిందకి కాదురా షుగర్ ఫ్యాక్టరీలోని తుక్కు మిషన్లో పడెయ్యాలి' అని మా నాన్న మళ్ళీ తిట్టారు. ఎలాగయితేనేం మొత్తానికి బయల్దేరాం. దగ్గరిదగ్గరిగా 20 కిలోమీటర్ల దూరం. గంటలో వెళ్ళిపోయాము. అవును గంటే. పల్లెటూరు కదా రోడ్లు బాగోవు మరి, జాయిగా వెళ్ళాలి.

పొద్దున్నే టీ, టిఫినీలకి, మద్యాహ్నం భోజనాలకి మధ్యలో తాగే టీల పనిలో ఉన్నారు మా పెద్ద తాతయ్య & ఫ్యామిలీ. మాకు రెండో దఫా టీ, టిఫినీలు అయ్యాయి. నేను, పెదనాన్న వాళ్ళ పిల్లలు ఆడుకోడానికి చెరకు తోటల్లోకి వెళ్ళాము. ఇక్కడ నన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. కావలసినన్ని చెరకు గడలు తినొచ్చు, తోట పక్కనుండే మామిడి తోపులోని చెట్లన్నీ ఎక్కచ్చు. అక్కడే బెల్లం తయారు చేసే ముందు వచ్చే పాకం తినొచ్చు. ఇలా చాలా సరదాగా గడిపేసాను. మద్యాహ్నం భోజనం చేసి మళ్లీ ఆటలు మొదలెట్టాము. సాయంత్రం వరకూ ఆడుకుని, తినాల్సినవి తినేసి మళ్ళీ ఇంకోసారి టీ, టిఫినీలు కానిచ్చి మా ఊరు బయల్దేరాము.

సాయంత్రం ఆరయింది. కొద్దికొద్దిగా చీకటి పడుతూ ఉంది. ఈ సారి కూడా పొద్దున్న లాగానే ముందు మా నాన్న డోరు పట్టుకుని కూర్చున్నారు. అప్పటికే భీమరాజు డోరుకి గుడ్డ కట్టేసుకున్నాడు. అందరం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మా నాన్న ఏదో అంటే భీమరాజు గట్టిగా నవ్వుతున్నాడు. ఇంతలోనే మా నాన్న రోడ్డు వైపు చూస్తూ గట్టిగా 'చూస్కోరా' అనడం, భీమరాజు సడన్ గా బ్రేక్ వేయడం, పెద్ద శబ్దం రావడం జరిగిపోయాయి. కారు కింద ఏదో పడినట్టు అర్ధమయింది మాకు. భీమరాజు వెంటనే కిందకి దిగి కారు చుట్టూ తిరిగి చూసాడు. ఏమి లేదని చెప్పాడు గాని మా నాన్న కూడా దిగి చూసారు. కారులో ఉన్న నాకు ఏం జరిగిందో ఏంటో, కారు కింద పడి ఎవరైనా చనిపోయారో ఏంటో అనుకుంటూ భయపడుతూ కూర్చున్నాను. మా కారు వచ్చిన దారిలోనే కొంచెం దూరంలో ఒక కోడి చచ్చిపోయి పడి ఉంది. భీమరాజు దాన్ని మా నాన్నకి చూపిస్తూ 'ఏవండీ మన బండేనంటారా తొక్కేసింది' అన్నాడు.
నాన్న: కళ్ళు మూస్కుని తోల్తే కోడినేంటి కొండనైనా తోక్కించేస్తావ్
భీమరాజు : ఊరుకోండి మీరు మరీను
నాన్న: సిగ్గుపడింది చాల్లే
భీమరాజు: ముందు దీన్ని తీసుకెళ్ళిపోదాం పదండి, అసలే పల్లెటూరు ఎవరైనా చూసారంటే కోడి మాదే డబ్బులివ్వండంటారు
నాన్న: ఎక్కడికి తీసుకుపోతావ్.. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మా తాతయ్య గారు ఎంట్రా ఏం జరిగింది? ఇంతసేపెంటి? అని అరిచారు. వెంటనే వాళ్ళిద్దరూ వచ్చి కార్లో కూర్చుని ఒకరు డోరు పట్టుకుని, ఇంకొకరు డోరుకి గుడ్డ కట్టుకుని బయల్దేరి ఇంకో అరగంటలో ఊరెళ్ళిపోయాము.
ఆ తర్వాత కొన్ని రోజులకి తెలిసింది, ఆ రోజు భీమరాజు కోడిని ఇంటికి తీసుకెళ్ళి కూర వండేసాడని.


Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Labels:

Monday, December 29, 2008

జ్యోతిలక్ష్మి దొరికింది - 2

జోతిలక్ష్మి తప్పిపోయిన పర్వం.

మా పొలం ఉండేది గొల్లవాని చెరువు అనే ఊళ్ళో. ఈ చిన్ని ఊరికి ఒక సెంటర్ కూడా ఉంది. అదే గొల్లవాని చెరువు సెంటర్. ముందుగా అక్కడికి వెళ్లి గేదె ఏమైనా అటుగా వచ్చిందేమో అని వాకబు చేసారు. అక్కడే ఉన్న అబద్దాన్ని(చాలా ముసలతను, మా పొలంలో ఏ పని ఉన్నా ముందుగా అతన్నే పిలిచేవారు, చుట్టని చులాగ్గా అడ్డ పొగ వేస్తాడు) కూడా అడిగారు. ఇటువైపు వెళ్ళగా నేను చూడలేదు అని చెప్పాడు. అలా వెతుకుతూ వడ్లవాని పాలెం, జిన్నూరు పాలెం, జిన్నూరు, కాపవరం, చింతపర్రు ఇలా చుట్టుపక్కల చాలా ఊళ్ళు వెతికారు. కానీ గేదె ఎక్కడుందో, ఎలా వెళ్లిందో, ఎవరూ చెప్పలేకపోయారు.

జోతిలక్ష్మి అంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. నన్ను చూడగానే తల ఎగరేసేది, అంటే దగ్గరకొస్తే పోడుస్తానన్నట్టు చూసేది. అందుకే నేను కొమ్ముల గేదెతోనే ఎక్కువగా ఆడుకునేవాడిని. దానికి పచ్చ గడ్డి వేసి జోతిలక్ష్మికి మాత్రం ఎండు గడ్డి వేసేవాడిని. గేదేలకి పచ్చగడ్డి అంటే చాలా ఇష్టం, జోతిలక్ష్మికి ఇంకా ఎక్కువిష్టం.

జోతిలక్ష్మి లేచిపోయి కాదు కాదు వెళ్లిపోయి రెండ్రోజులైంది. మా నాన్న ప్రతీ రోజూ పొద్దున్నే వెళ్లి గేదె గురించి వెతికి సాయంత్రానికి వచ్చేవారు. మూడోరోజు సంతోషంగా వచ్చారు జోతిలక్ష్మి దొరికిందంటూ.
ఎక్కడో జిన్నూరు పాలెంలో ఒకతనికి గేదె దొరికింది అని తెలిస్తే వెళ్లారు. అది మా జోతిలక్ష్మే. ఆ రెండ్రోజులు దానికి ఎంతో ఇష్టమైన పచ్చగడ్డితో పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మా నాన్నని చూడగానే ఎంతో సంతోషపడిపోయి రెండు బక్కెట్ల నీళ్లు కూడా తాగేసింది. అక్కడినుంచి మా నాన్న సైకిలు వెనకాలే స్పీడుగా నడుస్తూ పొలానికి వచ్చేసింది.
ఆ తర్వాత ఇంకెప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు.
Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Saturday, November 15, 2008

జ్యోతిలక్ష్మి దొరికింది

అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా.
సాయంత్రం ఐదయ్యింది, నాకు బడి ఐపోయింది.
ఇంటికి పది నిమిషాల్లో వచ్చేసాను. పెన్సిలు కాగితం తీస్కుని అరుగు మీద కూర్చున్నాను.
వచ్చేపొయ్యే స్కూటర్లు, కార్లు, బస్సులు ఇంకా లారీల నంబర్ ప్లేట్ల మీద ఉండే అంకెల్ని కలపడం నా అలవాటు.

ఇంతలొ మా తాతయ్యగారు(నాన్నకి నాన్న) అరుగుమీదే కుర్చీ వేసుకుని నాకు మూడు రూపాయలిచ్చి బర్కిలీ సిగరెట్ పాకెట్ తెమ్మన్నారు. నేను సగం తిట్టుకుంటూ బయల్దేరాను. ఈ సగమే ఎందుకంటే సిగరెట్ తాగడం అనే తతంగం నాకు నచ్చదు. ఇంకో సగం ఎందుకు తిట్టుకోలేదంటే సిగరెట్ పాకెట్ కి రెండున్నర పోగా మిగిలిన అర్ధరూపాయి నాదే.

ఇంటికి దగ్గర్లోనే ఉండే సోడా కొట్లో సిగరెట్ పాకెట్ కొని తిరిగి వచ్చేప్పుడు నిద్రగన్నేరు చెట్టు కింద ఉండే బడ్డీ కొట్లో అర్ధరుపాయితో రెండు మామిడి తాండ్ర ముక్కలు కొన్నాను.

ఈ బడ్డీ కొట్టు ముసలాయనకి నాకు పడదు. కాని వాళ్ళ కొట్లో ఉండే మామిడి తాండ్ర ముక్కలంటే మాత్రం భలే ఇష్టం. ముక్కలో నుంచి ఒక్కో పొర తీస్కుని తినడం ఇంకా ఇష్టం. అలా మామిడి తాండ్ర ముక్కలు తింటూ ఇంటికి వచ్చి తాతయ్యగారికి పాకెట్ ఇచ్చేసి నేను పెన్సిలు పేపరు తీస్కుని అంకెల్ని కలపడం కంటిన్యు చేసాను. కాసేపటికి పేపరు మీద డాఫీ డక్ బొమ్మ పూర్తయ్యింది. చీకటి కూడా పడింది.

ఏడున్నర అయిపోవచ్చింది ఇంకా నాన్న పొలం నుంచి పాలు తీసుకు రాలేదేంటి అనుకుంటూ టీవీ పక్కనుండే షోకేసు అరలోని జంతికలు డబ్బా ఖాళీ చేసాను. ఎప్పుడో రాత్రి తొమ్మిది గంటలకి నాన్న వచ్చారు. అప్పటికే భోంచేసి అరుగు మీద కూర్చున్నాను.
రావడమే మా నాన్న నీరసంగా వచ్చారు పాలు ఒక్క కేనులోనే ఉన్నాయంటూ. జ్యోతి లక్ష్మి కనిపించలేదు అందుకే పాలు తగ్గాయి అన్నారు. ఊరుకో నాన్న, అదేమైనా పేడ పురుగా ఏంటి కనిపించకపోడానికి అన్నాను. జ్యోతి లక్ష్మి అంటే మాకున్న రెండు గేదేల్లో ఒక గేదె పేరు. ఆ గేదె ఎప్పుడూ తలని అదో రకంగా ఉపుతూ వాటినెప్పుడైనా కడగడానికి కాలువలో దింపినప్పుడు నడుము నుంచి తోక వరకు పార్ట్ ని ఇంకో రకంగా తిప్పుతూ ఉండేది. అందుకే దాన్ని మా నాన్నగారు జ్యోతి లక్ష్మి అని పిలిచేవారు.

మేతకి మా పొలం లోనే రెండు గేదేల్నీ కట్టేసి ఉంచుతారు. సాయంకాలానికి కొమ్ముల గేదె ఉంది గాని జ్యోతి లక్ష్మి లేదంట.
పొలం దగ్గర్లోనే అంతా వెతికి పక్కనే ఉన్న వడ్లవాని పాలెంలో కూడా వెతికారంట.


ఇంకా ఉంది, జ్యోతి లక్ష్మి దొరికే వరకు :)

Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Sunday, October 26, 2008

కరంటు బాంబుకి రెండు దెబ్బలు

విషయం ఏంటంటే అవి దీపావళి దగ్గర పడుతున్న రోజులు. టపాసులు ఏమేమి కొనాలి, కాల్చాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఈ తీవ్రమైన ఆలోచనలు ఎందుకంటే టపాసులు మీద ఎక్కువ తగలేయకుడదని నిర్ణయించుకున్నా. కాబట్టి ఆ తగలేసేది తక్కువైనా ఎక్కువ సౌండు, వెలుగు రావాలి, జనాల చెవుల్లో ఆ సౌండు రెండ్రోజులైనా గింగుర్లు రావాలి, ఆ వెలుగు వల్ల కళ్లు మిరుమిట్లు గొలిపి ఉన్నాయా పోయాయా అనుకోవాలి. ఈ విధంగా ఆలోచిస్తున్న నాకు కాళ్ళ మధ్యన తిరిగే భూచక్రంలా సూర్రావు తగిలాడు. ఈ సూర్రావు వాళ్ల ఉరిలో పెళ్ళిళ్ళకి లైటింగు, టపాసులు కట్టేవాడినన్నాడు, ఈ మాటతో నా మొహం మతాబులా వెలిగిపోయింది, వంద జువ్వలు ఒకే అగరొత్తి తో వేసినట్టయింది. ఐతే నాకు బాంబులు కట్టివ్వు అన్నాను. మీకు మామూలు బాంబులు కాదు కరంటు బాంబులు కడతానన్నాడు.

కరంటు బాంబులా..

ఆహా..

ఒహో..

హబ్బబ్బబ్బ..


పేరు వింటేనే వంద లక్ష్మి బాంబుల్ని వత్తు లేకుండా వరుసగా పేల్చేసినట్టుంది. వింటుంటేనే ఇలా ఉంది నిజంగా పేలిస్తే పక్కింట్లో వాళ్ళకి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని ఉహించుకుంటేనే నా మొహం మతాబులా వెలిగిపోయింది.
నేనెప్పుడూ ఈ కరంటు బాంబులు గురించి వినలేదు. సామాన్లు కొనడానికి సుర్రావుకి డబ్బులిచ్చేసాను.అప్పటినుంచి సుర్రావు చుట్టూ బిగించి కట్టిన సిసింద్రిలా తిరుగుతూ విసిగించేసాను చేసావా తెచ్చావా అని.

మొత్తానికి పది కరంటు బాంబుల్ని చేసి తెచ్చాడు నేను వేసి చూస్తానని. నచ్చితే ఇంకా చేసి తెస్తానన్నాడు.
వాటిని ఎలా పేల్చాలో అడిగాను, ఎందుకంటే అవి కరంటు బాంబులు కదా.

వాటికి అంటించడానికి వత్తులుండవు. ఈ చివర ఆ చివర రెండు కరంటు వైర్లు బైటికి వచ్చి ఉన్నాయి. ప్లగ్ లో ఒక పెద్ద వైరు పెట్టి ఆ వైరుకి బాంబు చివరలో ఉన్న రెండు వైర్లని కనెక్ట్ చేసి సిచ్చేస్తే చాలు పక్కింటోడి గోడ కూలిపోవల్సిందే అన్నాడు. ఆ ఉహల్లోనే కాకరపువ్వొత్తు పట్టుకుని వేలాడుతున్న నేను ఉత్సాహంగా వాటిని తీసుకుని మేడ మీదున్న నా గదిలోకి దూరాను.

నాకు బావ వరసయ్యే ప్రసాదుని అడిగి పెద్ద వైరు తెచ్చాను. వాడు అడుగుతూనే ఉన్నాడు ఎందుకు అని కాని నేను చెప్పలేదు. గదిలో ఉన్న ప్లగ్ లో వైరు పెట్టాను. దాన్ని పక్కనే ఖాళీగా ఉండే లాయరు గారి స్ధలంలోకి(దీన్ని పందుల దొడ్డి అనేవాళ్ళం) కరంటు బాంబుని కట్టి వదిలాను. అంత బాగానే ఉంది, ఇప్పుడు ఇది పేలగానే పక్కనున్న డాబా గదిలో నిద్రపోతున్న మా తాత వస్తే ఏం చెప్పాలో కూడా ఆలోచించాను. అప్పుడు మధ్యాహ్నం రెండైంది. సెటప్పంతా బానే ఉంది ఇంకా సిచ్చేసయ్యడమే. వెయ్యాల్సిన స్విచ్చు గదిలో ఉంది, బాంబు దొడ్లో ఉంది. ఇప్పుడు అది పేలితే నేను చూడలేను. అది పేలాలంటే గదిలో స్విచ్చేయ్యాలి. ఇంక ఇది తెమిలేలా లేదని సిచ్చేయడానికే వెళ్ళాను. కింద బాంబెలా పేలుతుందో అనే దృశ్యాన్ని ఊహించుకుంటూ సిచ్చేసాను. వేసిన వాడ్ని వేసినట్టే వెళ్లి ఉల్లిపాయ బాంబులా గోడక్కోట్టుకున్నా. ఏమైందో అర్ధం కావడానికి ఐదు నిముషాలు పట్టింది.


సిచ్చేసినవెంటనే ఫ్యుసు కొట్టేసింది, నిప్పులు కూడా వచ్చాయి వీటన్నిటికి ముందు నాకు షాక్ కొట్టింది. ఆ దెబ్బకే వెళ్లి గోడకి అతుక్కుపోయాను. కింద బాంబు సంగతి తాతెరుగు ఇక్కడ మాత్రం నాకు ఫాన్సీ చిచ్చుబుడ్డి నుంచి వచ్చే మెరుపులు కనిపించాయి. తేరుకుని చూద్దును కదా ఇంట్లో కరంటు పోయింది. మా మావయ్యేమో ఒరేయ్ జనరేటర్ వెయ్యండిరా కరంటు పోయింది అంటున్నారు అసలు విషయం తెలీక. కిందకి వేలదేసిన వైరుని పైకి లాగాను బాంబుకి రెండు చివర్ల ఉన్న వైరు తప్ప ఇంక ఆనవాళ్ళు ఏమి కనిపించలేదు. ఏమి ఎరగనట్టు నేను వెళ్లి మా అమ్మమ్మ గదిలో పడుకున్నాను.


భోజనం చేసేసి చల్లబడిపోయిన వెన్నముద్దలాగ కూర్చున్నాను. ఇంతలో మా అన్నయ్య వచ్చాడు.వాడికి నే చేసిన ఘనకార్యం(నేను కాస్త అలాగే ఫీలయ్యాను) చెప్పాను. కరంటు బాంబుని కూడా చూపించాను.

వాడు బాంబుని నన్ను మార్చి మార్చి చూసి డబ్బా మూత పెట్టి నార బాంబుని పేల్చినట్టు నవ్వాడు.చిన్న పిల్లాడి చేతిలో సిసింద్రి చీదేసినట్టుంది నాకు. ఒక పక్కన షాక్ కొట్టించుకుని నేనుంటే ఇలా నవ్వుతాడా అని. కరంటు బాంబుని ఎన్ని రకాలుగా తిప్పి చూడొచ్చో అన్ని రకాలుగా చూసి ఇదా పేలిందా అని అడిగాడు. సరే చూద్దాం పద అంటూ పై గదిలోకి తీసుకెళ్ళాడు. లోపల నవ్వారు మంచం మీద తీరిగ్గా బాసిపట్టు వేసుక్కూర్చుని మళ్లీ దాన్ని పరిశీలించడం మొదలెట్టాడు.


అరేయ్ ఇది పెలుద్దాంరా మళ్లీ అన్నాను. ఇందాక నవ్వుతాడా వీడిక్కూడా కరంటు షాక్ కొట్టించాల్సిందే అనే కోపంతో. ఇది నిజంగా పేలేదే ఐతే ప్లగ్గులో వైరు పెట్టడం ఎందుకురా ఇదిగో ఈ బ్యాటరీ కి కన్నక్ట్ చేసినా పేలాలి అన్నాడు. బాంబు రెండు కొసల్నీ బ్యాటరీ ప్లస్సు మైనస్సు దగ్గర పెడితే చాలు పేలతాయి అన్నాడు. వద్దురా పేలుతుంది అన్నాను. దీనికంత సీను లేదురా ఇదేమీ పేలదు లే అన్నాడు. అంటూనే బ్యాటరీని కనక్ట్ చేసేసాడు.


ఢాం..మ్మ్..మ్మ్

గుయ్య్..య్..య్..య్..య్..య్..య్..య్

1


2


3


4


శీతాకాలంలో పొద్దున్నే పొలాల్లో చూస్తే అంతా మంచుతో కప్పేసి ఉంటుంది. పదడుగుల దూరం లో ఏముందో చెప్పలేము. మాది కూడా అదే పరిస్థితి. కాసేపు ఏమీ కనిపించలేదు. ఆ కాసేపు ఏమీ వినిపించలేదు కుడా. ఇద్దరం కిందకెళ్ళి మొహం కడుక్కున్నాము. అమ్మమ్మ గదిలోకెళ్ళి కూర్చున్నాము.అహ్హహ్హహ్హహహ్హహహ్హహ్హ అంటూ పడీ పడీ నవ్వుకున్నాం.

అంత కన్నా ఇంకేమి చేయలేము కదా.

Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Saturday, October 25, 2008

ఎర్ర టపాసు

కొడుకు: అమ్మా అమ్మా ఈ ఎర్ర టపాసు కాలుస్తానే మంచిగా సౌండు వస్తది
అమ్మ: ఒరేయ్ ఎదవ సచ్చినోడా అది సిలిండర్రా..


Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..