Friday, April 17, 2009

అన్నయ్యా కాంబినేషనా



మా అన్నయ్యకి తినడమంటే చాలా ఇష్టం. సన్నగా రివటలా ఉన్నాడు వీడేం తింటాడు అనుకుంటారు చూసినవాళ్ళు. కానీ చక్కగా తింటాడు. కాంబినేషన్స్ చేసుకుని తినడమంటే వల్లమాలిన ఇష్టం. ఈ ఇష్టమే క్రమంగా అభిమానంగా మారి అది కాస్తా వెర్రిగా అభివృద్ధి చెంది చివరికి వేయి తలలతో వికటాట్టహాసం చేయడం మొదలెట్టింది. ఎలా అంటే ఎప్పటిలా మొన్నొక రోజు నా రూంకి భోజనానికి వచ్చి చేపల పులుసులో టమాటా సాస్ కలుపుకుని 'అద్భుతం' అన్నాడు. ఇలా అయితే నా రూంకి రావద్దు అని గట్టిగ వార్నింగిచ్చాను (అప్పటికే నా రూమ్మేట్స్ రామీ గాడు, బస్సోడు ఇద్దరూ బయటికి పారిపోయారు). సరేలే అంటూ తనతో తెచ్చుకున్న ఒక బాక్స్ తెరిచాడు. ఏంట్రా తెచ్చావ్ అంటే పెరుగులో కాంబినేషన్ కోసం కోర్నెటొ చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చాను ట్రై చెయ్ అన్నాడు. ఇలా ముదిరింది మా వాడి కాంబినేషన్స్ వెర్రి.

చెప్తే వినడు, తప్పురా అంటే ఒప్పుకోడు. పైపెచ్చు నా క్రియేటివిటీని అర్ధం చేస్కొండ్రా అనడం మొదలెట్టాడు. ఫుడ్ కాంబినేషన్స్ మీద రీసర్చ్ చేస్తాను, నా క్రియేటివిటీని పెంచుకుంటాను అని శని, ఆదివారాలు మొత్తం సిటీలో ఉన్న రెస్టారెంట్ల మీద వరుసగా దాడి చేయడం మొదలెట్టాడు. పోయిన వారం బౌల్-ఓ-చైనా అనే చైనీస్ రెస్టారెంట్ కి వెళ్లి అమెరికన్ చాప్సి అనే ఐటం చూసి చైనీస్ ఫుడ్ లో అమెరిక అనుకుని ఆర్దరిచ్చేసాడు. అది వచ్చేలోగా ఒక చికెన్ సూప్ చెప్పాడు. వచ్చిన చికెన్ సూప్ లో వీడు తీసుకెళ్ళి ఊర మిరపకాయ పచ్చడి కలుపుకుని తాగేసాడు. ఆ తర్వాత వచ్చిన అమెరికన్ చాప్సిలో చిల్లి సాసు, టమాట సాసు వేసుకుని మిగిలిన ఊర మిరపకాయ పచ్చడి కలిపేసాడు. తను తినడమే కాకుండా పక్క టేబుల్ వాళ్ళకి కూడా ఆఫర్ చేసాడు. చివర్లో వెనీలా ఐస్ క్రీమ్ చెప్పి అందులో అరటిపండుతో చేసిన స్వీట్ కలుపుకుని తిన్నాడు. అప్పటికే పక్క టేబుల్సు వాళ్ళు గుసగుసలు ఎక్కువయ్యి కొంత మంది వెళ్ళిపోయేసరికి మేనేజ్మెంట్ వాళ్ళు వీడు తిన్న వాటికి బిల్లేసి దాని మీద టాక్స్ మాత్రం కట్టించుకుని పంపేసారు. అప్పటికీ వీడి రీసర్చ్ ని ఆపక పక్కనే ఉన్న ఫ్రూట్ జ్యూస్ సెంటర్లో దూరి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చెప్పి దానికి ముందు ఫ్రూట్ సలాడ్ చేయించుకుని అందులో నిమ్మకాయ పిండుకుని తినేసి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లో స్ప్రౌట్స్ కలుపుకుని తాగేసాడు.అప్పటికిగాని వీడి కడుపులో కరడుగట్టిన క్రియేటివిటీ కరగలేదు, చివరికి అరగలేదు, నేను మెడికల్ స్టోర్ కి పరుగెట్టక తప్పలేదు.

ఒకసారి మా ఊర్లోని చుట్టాలమ్మాయి పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ లో భోజనాలంటే మా వాడి రీసర్చు, క్రియేటివిటీ అనే రెండు వికృత చేష్టలు బయటికొచ్చి విలయతాండవం చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఐటమ్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఎక్కువ కాంబినేషన్స్ ట్రై చేయచ్చని వీడి నోటి దురదాభిప్రాయం. అలాంటపుడు వాడితో భోజనం చేయడమంటే ఒకే రోజు విజయకాంత్, టి. రాజేందర్, థ్రిల్లర్ మంజూల సినిమాలు చూసినట్టే. నేనింత భయపడటానికి కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి. మచ్చుకి ఒకటి, ఇద్దరమూ కలిసి మా కామన్ ఫ్రెండ్ కూతురి మొదటి పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్ళాం. అక్కడ వీడు బంగాళాదుంప ఫ్రైలో రసగుల్లా పాకం కలుపుకోబోయాడు నేను ఆపెలోగా ఉలవ చారు కలిపేసుకున్నాడు ఇటువంటి ఎన్నో దారుణాలు ఎదురయ్యేసరికి ఫంక్షన్స్ లో వీడితో కలిసి భోజనం చేయడం మానుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మా నాన్న గారు వచ్చి భోజనం చేద్దాం పదండ్రా అనగానే మీరు వెళ్ళండి నేను తర్వాతి బంతిలో తింటాను అన్నాను. ఇక్కడ బంతి భోజనాలవడంతో మా వాడు చాలా ఫీలయ్యాడు. అన్ని వాళ్ళు పెట్టినప్పుడే తినాలి కాంబినేషన్స్ ట్రై చేయడానికి వీలవదు బఫేలో లాగా అని తను అరిటాకులో తిననని ప్లేటు అడిగి తీస్కుని అన్ని ఐటమ్స్ ఉండే టేబుల్ పక్కకు చేరాడు. ఇక మొదలెట్టాడు బూరికి చిల్లెట్టి సాంబారు పోయడం, గుత్తి వంకాయ కూరలో జాంగ్రీ పిసకడం ఇలా చివరకు పెరుగులో నెయ్యి వేయమనేంత వరకు వెళ్ళాడు. మా నాన్న గారు వెళ్లి ఇదేంట్రా అని అడిగితే సాంబారులో రస్నా కలుపుకుంటావా లేదా అంటూ మొండికేసాడు. నేనింకా తట్టుకోలేక వీడ్ని పక్కకు తీసుకెళ్ళాను. నా భోజనం అయ్యేలోగా కొబ్బరి నీళ్ళల్లో పనసతొనలు ముంచుకుని తింటున్నాడు. ఇదేంట్రా అంటే సంబారిడ్లీ లాగా అంటూ పోలిక చెప్పాడు.

ఈ విపరీత ధోరణి దగ్గరివాళ్ళకే తప్ప బయటి వాళ్లకి తెలీదు. చిన్నప్పుడు వీడితో కలిసి చదువుకున్న వెంకటరత్నం కనిపించాడు. ఏం చేస్తున్నావని అడిగితే తాజ్ బంజారాలో చెఫ్ ని అన్నాడు. అయితే ఈ సంగతి మా అన్నయ్యకి చెప్పోద్దన్నాను. కాని వీడికి ఎలా తెలిసిందో వాడితో బాగా జతకట్టాడు. వీడి ఫుడ్ ఇంట్రస్ట్ చూసి ముచ్చటపడి వెంకటరత్నంగాడు ఒక రోజు వీడ్ని తాజ్ బంజారా కిచెన్ లోకి తీస్కెళ్ళాడు. వీడ్ని పక్కన కూర్చోబెట్టి ఎవరో ఫారిన్ నుంచి వచ్చిన గవర్నమెంట్ అఫిసియల్స్ కి బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తున్నాడు. వెంకటరత్నంగాడు చూడనపుడు వాడు చేసిన సాండ్విచ్ లో వీడి కొంచెం టేస్టింగ్ సాల్ట్ కలిపాడు వెనిగర్ మిక్స్ చేసి. అంతే అప్పుడు కనిపించడమే మా వెంకటరత్నంగాడు.

ఇప్పటివరకూ కాంబినేషన్స్ అంటూ రెండు ఐటమ్స్ మాత్రమే కలిపేవాడు. కాని ఇప్పుడు క్రియేటివిటీ ఎక్కువయ్యి మల్టిపుల్ కాంబినేషన్స్ అంటున్నాడు. ఈ రోజే మా అమ్మ, నాన్న హైదరాబాద్ వచ్చారు అన్నయ్య ఫ్లాట్ కి. వెళ్లి చూద్దును కదా మా అమ్మ చేత కొబ్బరిముక్కలకి కారప్పొడి దట్టించుకుని కాఫీలో కలుపుకుని తాగుతున్నాడు.




Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Labels:

13 Comments:

Blogger చైతన్య said...

అలాంటపుడు వాడితో భోజనం చేయడమంటే ఒకే రోజు విజయకాంత్, టి. రాజేందర్, థ్రిల్లర్ మంజూల సినిమాలు చూసినట్టే. భలే రాసారు... నవ్వుకోలేక చచ్చాను... :D

మా ఫ్రెండ్ ఒకమ్మాయి కుడా ఉంది ఇలాగే... పెరుగన్నంలో సాస్ వేసుకుని తింటుంది!!

April 17, 2009  
Blogger చైతన్య said...

అన్నట్టు మీ sketch superrrrrrrrrrrrr

April 17, 2009  
Blogger మంచు said...

నాకయితె కొన్ని కాంబినెషన్స్ బాగానె వున్నయె.
ఫ్రూట్ సలాడ్ -నిమ్మకాయ, వెనీలా ఐస్ క్రీమ్-అరటిపండు-అమెర్కన్ స్తైల్ ,
బంగాళాదుంప ఫ్రైలో రసగుల్లా పాకం -బెంగాలి ,గుత్తి వంకాయ కూరలో జాంగ్రీ- బెంగాలి
నాట్ బాడ్ ..మీరు ట్రై చెయ్యచ్చు.

April 17, 2009  
Blogger Unknown said...

Nice Blog keep it up

April 17, 2009  
Blogger సిరిసిరిమువ్వ said...

:). ఇన్ని వెరైటీ కాంబినేషన్సా!!! ఇలాంటి కాంబినేషన్సు కనిపెట్టినందుకు మీ అన్నయ్య గారికి అభినందనలు తెలియచేయండి.

April 17, 2009  
Blogger నేను said...

పెరుగూ కార్నెటో చక్లేట్ ఐస్క్రీం చాలా బావుంటుంది..కానీ మరీ వెరైటీ విత్తనం ఇంతై ఇంతింతై...కాఫీలో కారం వరకూ కూడా వెళ్ళిందంటే మరి సైంటిస్టే..
మీ అన్నయ్య sketch బావుంది ఇంకో వెరైటీ కాంబినేషన్ ఆలోచిస్తూ :)

April 17, 2009  
Blogger చైతన్య.ఎస్ said...

మీరు రాసిన విధానం :)
మీ అన్న గారి కాంబినేషన్స్ :)

April 17, 2009  
Blogger ఓ బ్రమ్మీ said...

మీరు మరీనండి .. పాపం మీ అన్నయ్యను మాఇంటికి పంపించండి .. చక్కగా ఎన్ని రకాల కొత్త కాంబినేషన్స్ చెయ్యొచ్చో నేను ట్రైనింగ్ ఇస్తా..

July 18, 2009  
Blogger రానారె said...

ఐతే ఓకే. :))
అన్నయ్య చిన్నప్పటిదా పైన బొమ్మ?

August 10, 2009  
Blogger శివ చెరువు said...

అప్పటికిగాని వీడి కడుపులో కరడుగట్టిన క్రియేటివిటీ కరగలేదు, చివరికి అరగలేదు, నేను మెడికల్ స్టోర్ కి పరుగెట్టక తప్పలేదు. Very nice...

February 01, 2010  
Blogger Brahmi said...

సో.. ఫన్నీ ఫన్నీ... :-)

April 13, 2010  
Blogger CRESCENT PUBLICATIONS said...

అబ్బో... నువ్వింత మంచి రాతగాడివనుకోలేదు.
ఐతే... ఓకే... నీతో నాకు చాలా పని ఉంది.

December 26, 2010  
Blogger Telugu Cartoon said...

Very nice article. Liked it a lot.

February 23, 2011  

Post a Comment

<< Home