Wednesday, October 02, 2013

నాన్న

నీ మీద చాలా కోపంగా ఉంది. నువ్వు నాకు ఏమీ కొనడం లేదు. నీ గురించి ఆ రోజు రాత్రి చాలా సేపు నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉన్నాను. అప్పుడే సందు తలుపు తెరిచి సైకిల్ పెడుతున్న చప్పుడయింది. వెంటనే లేచి వెనుక తలుపు తెరిచాను. ఆత్రం నిండిన కళ్ళతో నీ చేతిలోకి చూసాను, ఏవో సంచులు కనిపించాయి. నాన్నా తెచ్చావా? ఇంకా సంచులు తెరవకుండానే అడిగాను. ఈ రోజు ఖచ్చితంగా తెస్తానని మూడు రోజుల క్రితమే చెప్పావు. 'నీ కోసం కోడి పలావు తెచ్చాను ముందు ఇది తిను' అన్నావు. కొద్ది కొద్దిగా అనుమానం మొదలయ్యింది నాలో, 'నువ్వు తెచ్చావో లేదో చెప్పు' అని మళ్ళీ అడిగాను. ఇంకా రాలేదన్నాడురా, ఇంకో రెండ్రోజుల్లో... ఇంక నీ మాటలు పూర్తి కాకుండానే నా కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతూ ఇంకేమీ వినిపించుకోకుండా ఎంత వేగంగా వెళ్లి తలుపు తెరిచానో అంతే వేగంగా వెనక్కి వచ్చి మంచం మీద ముసుగు తన్నాను.

"చిన్నా, రామ్మా తిందాము నాకు బాగా ఆకలవుతోంది, నువ్వు తింటేనే నేను తింటాను" అని నువ్వు ఎంతగా బతిమాలుతున్నా ముసుగు తియ్యకుండా బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకునే ఉన్నాను.

బుజ్జగించావు - అదిలించాను
చక్కిలిగిలి పెట్టావు - కోపంగా నవ్వాపుకున్నాను
గట్టిగా లాగావు - విదిలించుకున్నాను
ఎన్ని చేసినా నేను మాత్రం ముసుగు తియ్యలేదు, నువ్వు తినలేదనే విషయాన్నే పట్టించుకోలేదు.

ఇది జరిగి ఇరవై సంవత్సరాలయ్యుంటుంది. నా వల్ల నువ్వు తినలేదనే బాధ ఉంది.
ఇప్పటికీ కాంపస్ బాక్స్ కొనలేదనే కోపం ఆ బాధని జయించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 
నీకు గుర్తుందా నాన్నా?

Labels:

2 Comments:

Blogger శరత్ కాలమ్ said...

బావుంది. మా నాన్న గుర్తుకు వచ్చాడూ, నాలోని నాన్నా గుర్తుకు వచ్చాడు.

October 02, 2013  
Blogger Unknown said...

overallgaa naanna supergaa undi.
http://www.googlefacebook.info/

October 29, 2013  

Post a Comment

<< Home