Saturday, October 20, 2007

ఎందుకంటే.. మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.

గమనిక: ఏదో తింటూనో, తాగుతూనో ఇది చదవద్దు.

పెగ్-1: మందు విషయంలో మాత్రం మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, మా ఆవిడ వంట చేస్తుంటుంది.
వంటింట్లోంచి వంటపాత్రల్ శబ్దం వినిపిస్తూంటూంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరతాం.
చెక్క బీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే.. మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటకమీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
గ్లాసు కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
అఫ్‌కోర్స్, బాటిల్ కూడా చెక్కబీరువాలో పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు.
వంటింట్లోకి తొంగిచూస్తాను.
మా ఆవిడ చపాతీపిండి కలుపుతూటూంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే.. మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: శర్మగారమ్మాయి పెళ్ళి సంగతేమైంది?
ఆవిడ: తిన్నగా ఉంటే కదా మంచి సంబంధాలు రావడానికి?

పెగ్-2: మనం మళ్ళీ ఇవతలకి వస్తాం.
చెక్కబీరువా తలుపు చప్పుడు చేస్తుంది.
మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్ తీస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే.. మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఏమిటోయ్, మన శర్మ కూతురు అప్పుడే పెళ్ళీడుకొచ్చేసిందా?
ఆవిడ: ఇంకా పెళ్ళి వయసేంటి? అడ్డగాడిదలా ముఫ్పైయేళ్ళొస్తుంటే.
నేను: ఓ.. ఐసీ!

పెగ్-3 మనం మళ్ళా చెక్కబీరువాలోంచి చపాతీ పిండి తీస్తాం.
చెక్కబీరువాలో బాత్రూం ప్రత్యక్ష్యం అవుతుంది.
బాటిల్ తీసి అటకలో రెండౌన్సులు పోస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి ముడుచుకుంటాం.
తాతగారు పడీపడీ నవ్వుతూంటాడు.
అటకని పిండిమీద పెట్టేసి తాతయ్యని కడీగేసి చెక్కబీరువాలో పెట్టేస్తాం.
వంటింట్లోకి తోంగిచూస్తాం.
మా ఆవిడ పొయ్యిమీద బాత్రూం పెడుతుంది.
ఈ బాటిల్లో సద్దు ఆ బాటిల్లో పడనివ్వం.
ఎందుకంటే, మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఏంటే మా శర్మగార్ని గాడిదంటావా, తోలు ఒలిచేస్తాను.
ఆవిడ: ఊరికే గొడవ చెయ్యకుండా వెళ్ళి పడుకోండి.

పెగ్-4 మనం పిండిలోంచి బాటిల్ తీస్తాం.
చెక్క బీరువాలో ఓ పెగ్గు కలుపుతాం.
బాత్రూం కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
మా ఆవిడ ఫోటోలోంచి నవ్వుతూ చూస్తుంటే గాంధీ వంట చేస్తూంటాడు.
ఈ శర్మ సంగతి ఆ శర్మగాడికి తెలియనివ్వం.
ఎందుకంటే.. మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఇంతకీ శర్మగాడి పెళ్ళి ఆ గాడిదతో అయ్యిందా లేదా?
ఆవిడ: నెత్తిమీద బక్కెట్ నీళ్ళు పోసానంటే.. వెళ్ళండి బయటికి.

పెగ్-5 నేను మళ్ళీ కిచెన్‌లోకి వెళ్తాను.
నిశ్శబ్దంగా అటకమీద కూర్చుంటాను.
డ్రాయింగ్‌రూంలోంచి బాటిళ్ళ శబ్దం వినిపిస్తుంటుంది.
నేను లోపలికి తొంగిచూస్తే మా ఆవిడ బాత్రూంలో మందేస్తుంటుంది.
వెంటనే లటుక్కున మూతేసి చటుక్కున పెగ్గు తుడుచుకుంటాం.
ఈ గాడిద చప్పుడు ఆ గాడిద చెవిలో పడనివ్వం.
అఫ్‌కోర్స్, తాతయ్యెప్పుడూ రిస్క్ తీసుకోడు.
శర్మ వంట చెయ్యడం పూర్తయ్యేవరకూ మనం ఫోటోలో కూర్చుని మా ఆవిణ్ణి చూసి నవ్వుతుంటాం.
ఎందుకంటే, మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.

ఇది ఈనాడు ఆదివారం బుక్కు నుంచి కాపీ చేసింది.


Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..