Tuesday, March 17, 2009

మూడు మూళ్లు తొమ్మిది

3339, అవును మూడు మూళ్లు తొమ్మిదే కదా . నాకు లెక్కలు ఆట్టే రావు కానీ కూడికలు మాత్రం బాగా వచ్చు... అని నమ్మకం. నాకు నచ్చితే నమ్ముతాను, నమ్మితే చెప్తాను, చెప్పిందే మర్చిపోతాను.. ఒక్కోసారి. ఒకవేళ నేను నమ్మింది తప్పైతే నాకిష్టమైన జీనియస్ ఆయినా చెప్పాలి లేదా సన్నాసైనా చెప్పాలి.

ఇప్పుడు చెప్పొచ్చేదేంటంటే నాకిష్టం లేని లెక్కల గురించి కాదు, మూడు మూళ్లు తొమ్మిది అనే నంబరు గల ఒక తెల్లటి(అక్కడక్కడా పెచ్చులూడిపోయిన) కారు గురించి. ఈ కారు యజమాని భీమరాజు. భీమరాజు వంశీ సినిమాలోని కారెక్టర్ లాగా చాలా సరదాగా ఉంటాడు. తన కారుని ఎంతో ప్రేమించి, లాలించి, కీర్తించి, బుజ్జగించి, చివరికి జాడించి తన్ని మరీ నడిపించేవాడు. ఇతను మా నాన్నకి ఫ్రెండు.

ఒకసారి మా తాతయ్యగారికి స్వయానా అన్నయ్యయిన మా పెద్ద తాతయ్యగారింటికి బయల్దేరాము. వాళ్ళ పిల్లల పిల్లలందరితో కలిసి బోళ్ళోరి పాలెంలో (బోళ్ళ వారి పాలెం) ఉండేవారు. చాలా పెద్ద ఫ్యామిలీ.
కారులో వెళ్దామని మా నాన్న భీమరాజుని రమ్మన్నారు. మర్నాడు పొద్దున్నే భీమరాజు కారుకి డీజిలు పోయించి, టైర్లకి గాలి పట్టించి మా ఇంటి ముందు వాలాడు. టీలు, టీఫినీలు కానిచ్చి బయల్దేరాం.

డ్రైవరు పక్కనుండే ముందు సీట్లో కూర్చోడమంటే మా తాతయ్యగారికి ఇష్టం. కానీ ముందు సీట్లో మా నాన్నగారిని కూర్చోమన్నాడు. 'ఎందుకురా' అంటే 'అటువైపు డోరు సరిగ్గా పడటంలేదు పట్టుక్కోర్చోవాలి' అన్నాడు. 'వార్నీ కారుని తీస్కెళ్ళి లాకూల కిందకి గెంట ఇదేం ఫిట్టింగురా' అంటే 'ఈ సారికి సర్దుక్కూర్చోండీ' అంటూ తన వైపు డోరు వేస్కుని వెనకాల డోరుకి కలిపి గుడ్డ కట్టడం మొదలెట్టాడు. 'అదెందుకురా' అంటే 'ఈ డోరు కూడా సరిగా పట్టదండి కారు తోలేటప్పుడు పట్టుకోడం ఇబ్బందవుతుందని గుడ్డ కడుతున్నా' అన్నాడు . 'ఒరేయ్ నీ కారుని లాకూల కిందకి కాదురా షుగర్ ఫ్యాక్టరీలోని తుక్కు మిషన్లో పడెయ్యాలి' అని మా నాన్న మళ్ళీ తిట్టారు. ఎలాగయితేనేం మొత్తానికి బయల్దేరాం. దగ్గరిదగ్గరిగా 20 కిలోమీటర్ల దూరం. గంటలో వెళ్ళిపోయాము. అవును గంటే. పల్లెటూరు కదా రోడ్లు బాగోవు మరి, జాయిగా వెళ్ళాలి.

పొద్దున్నే టీ, టిఫినీలకి, మద్యాహ్నం భోజనాలకి మధ్యలో తాగే టీల పనిలో ఉన్నారు మా పెద్ద తాతయ్య & ఫ్యామిలీ. మాకు రెండో దఫా టీ, టిఫినీలు అయ్యాయి. నేను, పెదనాన్న వాళ్ళ పిల్లలు ఆడుకోడానికి చెరకు తోటల్లోకి వెళ్ళాము. ఇక్కడ నన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. కావలసినన్ని చెరకు గడలు తినొచ్చు, తోట పక్కనుండే మామిడి తోపులోని చెట్లన్నీ ఎక్కచ్చు. అక్కడే బెల్లం తయారు చేసే ముందు వచ్చే పాకం తినొచ్చు. ఇలా చాలా సరదాగా గడిపేసాను. మద్యాహ్నం భోజనం చేసి మళ్లీ ఆటలు మొదలెట్టాము. సాయంత్రం వరకూ ఆడుకుని, తినాల్సినవి తినేసి మళ్ళీ ఇంకోసారి టీ, టిఫినీలు కానిచ్చి మా ఊరు బయల్దేరాము.

సాయంత్రం ఆరయింది. కొద్దికొద్దిగా చీకటి పడుతూ ఉంది. ఈ సారి కూడా పొద్దున్న లాగానే ముందు మా నాన్న డోరు పట్టుకుని కూర్చున్నారు. అప్పటికే భీమరాజు డోరుకి గుడ్డ కట్టేసుకున్నాడు. అందరం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మా నాన్న ఏదో అంటే భీమరాజు గట్టిగా నవ్వుతున్నాడు. ఇంతలోనే మా నాన్న రోడ్డు వైపు చూస్తూ గట్టిగా 'చూస్కోరా' అనడం, భీమరాజు సడన్ గా బ్రేక్ వేయడం, పెద్ద శబ్దం రావడం జరిగిపోయాయి. కారు కింద ఏదో పడినట్టు అర్ధమయింది మాకు. భీమరాజు వెంటనే కిందకి దిగి కారు చుట్టూ తిరిగి చూసాడు. ఏమి లేదని చెప్పాడు గాని మా నాన్న కూడా దిగి చూసారు. కారులో ఉన్న నాకు ఏం జరిగిందో ఏంటో, కారు కింద పడి ఎవరైనా చనిపోయారో ఏంటో అనుకుంటూ భయపడుతూ కూర్చున్నాను. మా కారు వచ్చిన దారిలోనే కొంచెం దూరంలో ఒక కోడి చచ్చిపోయి పడి ఉంది. భీమరాజు దాన్ని మా నాన్నకి చూపిస్తూ 'ఏవండీ మన బండేనంటారా తొక్కేసింది' అన్నాడు.
నాన్న: కళ్ళు మూస్కుని తోల్తే కోడినేంటి కొండనైనా తోక్కించేస్తావ్
భీమరాజు : ఊరుకోండి మీరు మరీను
నాన్న: సిగ్గుపడింది చాల్లే
భీమరాజు: ముందు దీన్ని తీసుకెళ్ళిపోదాం పదండి, అసలే పల్లెటూరు ఎవరైనా చూసారంటే కోడి మాదే డబ్బులివ్వండంటారు
నాన్న: ఎక్కడికి తీసుకుపోతావ్.. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మా తాతయ్య గారు ఎంట్రా ఏం జరిగింది? ఇంతసేపెంటి? అని అరిచారు. వెంటనే వాళ్ళిద్దరూ వచ్చి కార్లో కూర్చుని ఒకరు డోరు పట్టుకుని, ఇంకొకరు డోరుకి గుడ్డ కట్టుకుని బయల్దేరి ఇంకో అరగంటలో ఊరెళ్ళిపోయాము.
ఆ తర్వాత కొన్ని రోజులకి తెలిసింది, ఆ రోజు భీమరాజు కోడిని ఇంటికి తీసుకెళ్ళి కూర వండేసాడని.






Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Labels: