Saturday, November 15, 2008

జ్యోతిలక్ష్మి దొరికింది

అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా.
సాయంత్రం ఐదయ్యింది, నాకు బడి ఐపోయింది.
ఇంటికి పది నిమిషాల్లో వచ్చేసాను. పెన్సిలు కాగితం తీస్కుని అరుగు మీద కూర్చున్నాను.
వచ్చేపొయ్యే స్కూటర్లు, కార్లు, బస్సులు ఇంకా లారీల నంబర్ ప్లేట్ల మీద ఉండే అంకెల్ని కలపడం నా అలవాటు.

ఇంతలొ మా తాతయ్యగారు(నాన్నకి నాన్న) అరుగుమీదే కుర్చీ వేసుకుని నాకు మూడు రూపాయలిచ్చి బర్కిలీ సిగరెట్ పాకెట్ తెమ్మన్నారు. నేను సగం తిట్టుకుంటూ బయల్దేరాను. ఈ సగమే ఎందుకంటే సిగరెట్ తాగడం అనే తతంగం నాకు నచ్చదు. ఇంకో సగం ఎందుకు తిట్టుకోలేదంటే సిగరెట్ పాకెట్ కి రెండున్నర పోగా మిగిలిన అర్ధరూపాయి నాదే.

ఇంటికి దగ్గర్లోనే ఉండే సోడా కొట్లో సిగరెట్ పాకెట్ కొని తిరిగి వచ్చేప్పుడు నిద్రగన్నేరు చెట్టు కింద ఉండే బడ్డీ కొట్లో అర్ధరుపాయితో రెండు మామిడి తాండ్ర ముక్కలు కొన్నాను.

ఈ బడ్డీ కొట్టు ముసలాయనకి నాకు పడదు. కాని వాళ్ళ కొట్లో ఉండే మామిడి తాండ్ర ముక్కలంటే మాత్రం భలే ఇష్టం. ముక్కలో నుంచి ఒక్కో పొర తీస్కుని తినడం ఇంకా ఇష్టం. అలా మామిడి తాండ్ర ముక్కలు తింటూ ఇంటికి వచ్చి తాతయ్యగారికి పాకెట్ ఇచ్చేసి నేను పెన్సిలు పేపరు తీస్కుని అంకెల్ని కలపడం కంటిన్యు చేసాను. కాసేపటికి పేపరు మీద డాఫీ డక్ బొమ్మ పూర్తయ్యింది. చీకటి కూడా పడింది.

ఏడున్నర అయిపోవచ్చింది ఇంకా నాన్న పొలం నుంచి పాలు తీసుకు రాలేదేంటి అనుకుంటూ టీవీ పక్కనుండే షోకేసు అరలోని జంతికలు డబ్బా ఖాళీ చేసాను. ఎప్పుడో రాత్రి తొమ్మిది గంటలకి నాన్న వచ్చారు. అప్పటికే భోంచేసి అరుగు మీద కూర్చున్నాను.
రావడమే మా నాన్న నీరసంగా వచ్చారు పాలు ఒక్క కేనులోనే ఉన్నాయంటూ. జ్యోతి లక్ష్మి కనిపించలేదు అందుకే పాలు తగ్గాయి అన్నారు. ఊరుకో నాన్న, అదేమైనా పేడ పురుగా ఏంటి కనిపించకపోడానికి అన్నాను. జ్యోతి లక్ష్మి అంటే మాకున్న రెండు గేదేల్లో ఒక గేదె పేరు. ఆ గేదె ఎప్పుడూ తలని అదో రకంగా ఉపుతూ వాటినెప్పుడైనా కడగడానికి కాలువలో దింపినప్పుడు నడుము నుంచి తోక వరకు పార్ట్ ని ఇంకో రకంగా తిప్పుతూ ఉండేది. అందుకే దాన్ని మా నాన్నగారు జ్యోతి లక్ష్మి అని పిలిచేవారు.

మేతకి మా పొలం లోనే రెండు గేదేల్నీ కట్టేసి ఉంచుతారు. సాయంకాలానికి కొమ్ముల గేదె ఉంది గాని జ్యోతి లక్ష్మి లేదంట.
పొలం దగ్గర్లోనే అంతా వెతికి పక్కనే ఉన్న వడ్లవాని పాలెంలో కూడా వెతికారంట.


ఇంకా ఉంది, జ్యోతి లక్ష్మి దొరికే వరకు :)





Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..