విషయం ఏంటంటే అవి దీపావళి దగ్గర పడుతున్న రోజులు. టపాసులు ఏమేమి కొనాలి, కాల్చాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఈ తీవ్రమైన ఆలోచనలు ఎందుకంటే టపాసులు మీద ఎక్కువ తగలేయకుడదని నిర్ణయించుకున్నా. కాబట్టి ఆ తగలేసేది తక్కువైనా ఎక్కువ సౌండు, వెలుగు రావాలి, జనాల చెవుల్లో ఆ సౌండు రెండ్రోజులైనా గింగుర్లు రావాలి, ఆ వెలుగు వల్ల కళ్లు మిరుమిట్లు గొలిపి ఉన్నాయా పోయాయా అనుకోవాలి. ఈ విధంగా ఆలోచిస్తున్న నాకు కాళ్ళ మధ్యన తిరిగే భూచక్రంలా సూర్రావు తగిలాడు. ఈ సూర్రావు వాళ్ల ఉరిలో పెళ్ళిళ్ళకి లైటింగు, టపాసులు కట్టేవాడినన్నాడు, ఈ మాటతో నా మొహం మతాబులా వెలిగిపోయింది, వంద జువ్వలు ఒకే అగరొత్తి తో వేసినట్టయింది. ఐతే నాకు బాంబులు కట్టివ్వు అన్నాను. మీకు మామూలు బాంబులు కాదు కరంటు బాంబులు కడతానన్నాడు.
కరంటు బాంబులా..
ఆహా..
ఒహో..
హబ్బబ్బబ్బ..
పేరు వింటేనే వంద లక్ష్మి బాంబుల్ని వత్తు లేకుండా వరుసగా పేల్చేసినట్టుంది. వింటుంటేనే ఇలా ఉంది నిజంగా పేలిస్తే పక్కింట్లో వాళ్ళకి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని ఉహించుకుంటేనే నా మొహం మతాబులా వెలిగిపోయింది.
నేనెప్పుడూ ఈ కరంటు బాంబులు గురించి వినలేదు. సామాన్లు కొనడానికి సుర్రావుకి డబ్బులిచ్చేసాను.అప్పటినుంచి సుర్రావు చుట్టూ బిగించి కట్టిన సిసింద్రిలా తిరుగుతూ విసిగించేసాను చేసావా తెచ్చావా అని.
మొత్తానికి పది కరంటు బాంబుల్ని చేసి తెచ్చాడు నేను వేసి చూస్తానని. నచ్చితే ఇంకా చేసి తెస్తానన్నాడు.
వాటిని ఎలా పేల్చాలో అడిగాను, ఎందుకంటే అవి కరంటు బాంబులు కదా.
వాటికి అంటించడానికి వత్తులుండవు. ఈ చివర ఆ చివర రెండు కరంటు వైర్లు బైటికి వచ్చి ఉన్నాయి. ప్లగ్ లో ఒక పెద్ద వైరు పెట్టి ఆ వైరుకి బాంబు చివరలో ఉన్న రెండు వైర్లని కనెక్ట్ చేసి సిచ్చేస్తే చాలు పక్కింటోడి గోడ కూలిపోవల్సిందే అన్నాడు. ఆ ఉహల్లోనే కాకరపువ్వొత్తు పట్టుకుని వేలాడుతున్న నేను ఉత్సాహంగా వాటిని తీసుకుని మేడ మీదున్న నా గదిలోకి దూరాను.
నాకు బావ వరసయ్యే ప్రసాదుని అడిగి పెద్ద వైరు తెచ్చాను. వాడు అడుగుతూనే ఉన్నాడు ఎందుకు అని కాని నేను చెప్పలేదు. గదిలో ఉన్న ప్లగ్ లో వైరు పెట్టాను. దాన్ని పక్కనే ఖాళీగా ఉండే లాయరు గారి స్ధలంలోకి(దీన్ని పందుల దొడ్డి అనేవాళ్ళం) కరంటు బాంబుని కట్టి వదిలాను. అంత బాగానే ఉంది, ఇప్పుడు ఇది పేలగానే పక్కనున్న డాబా గదిలో నిద్రపోతున్న మా తాత వస్తే ఏం చెప్పాలో కూడా ఆలోచించాను. అప్పుడు మధ్యాహ్నం రెండైంది. సెటప్పంతా బానే ఉంది ఇంకా సిచ్చేసయ్యడమే. వెయ్యాల్సిన స్విచ్చు గదిలో ఉంది, బాంబు దొడ్లో ఉంది. ఇప్పుడు అది పేలితే నేను చూడలేను. అది పేలాలంటే గదిలో స్విచ్చేయ్యాలి. ఇంక ఇది తెమిలేలా లేదని సిచ్చేయడానికే వెళ్ళాను. కింద బాంబెలా పేలుతుందో అనే దృశ్యాన్ని ఊహించుకుంటూ సిచ్చేసాను. వేసిన వాడ్ని వేసినట్టే వెళ్లి ఉల్లిపాయ బాంబులా గోడక్కోట్టుకున్నా. ఏమైందో అర్ధం కావడానికి ఐదు నిముషాలు పట్టింది.
సిచ్చేసినవెంటనే ఫ్యుసు కొట్టేసింది, నిప్పులు కూడా వచ్చాయి వీటన్నిటికి ముందు నాకు షాక్ కొట్టింది. ఆ దెబ్బకే వెళ్లి గోడకి అతుక్కుపోయాను. కింద బాంబు సంగతి తాతెరుగు ఇక్కడ మాత్రం నాకు ఫాన్సీ చిచ్చుబుడ్డి నుంచి వచ్చే మెరుపులు కనిపించాయి. తేరుకుని చూద్దును కదా ఇంట్లో కరంటు పోయింది. మా మావయ్యేమో ఒరేయ్ జనరేటర్ వెయ్యండిరా కరంటు పోయింది అంటున్నారు అసలు విషయం తెలీక. కిందకి వేలదేసిన వైరుని పైకి లాగాను బాంబుకి రెండు చివర్ల ఉన్న వైరు తప్ప ఇంక ఆనవాళ్ళు ఏమి కనిపించలేదు. ఏమి ఎరగనట్టు నేను వెళ్లి మా అమ్మమ్మ గదిలో పడుకున్నాను.
భోజనం చేసేసి చల్లబడిపోయిన వెన్నముద్దలాగ కూర్చున్నాను. ఇంతలో మా అన్నయ్య వచ్చాడు.వాడికి నే చేసిన ఘనకార్యం(నేను కాస్త అలాగే ఫీలయ్యాను) చెప్పాను. కరంటు బాంబుని కూడా చూపించాను.
వాడు బాంబుని నన్ను మార్చి మార్చి చూసి డబ్బా మూత పెట్టి నార బాంబుని పేల్చినట్టు నవ్వాడు.చిన్న పిల్లాడి చేతిలో సిసింద్రి చీదేసినట్టుంది నాకు. ఒక పక్కన షాక్ కొట్టించుకుని నేనుంటే ఇలా నవ్వుతాడా అని. కరంటు బాంబుని ఎన్ని రకాలుగా తిప్పి చూడొచ్చో అన్ని రకాలుగా చూసి ఇదా పేలిందా అని అడిగాడు. సరే చూద్దాం పద అంటూ పై గదిలోకి తీసుకెళ్ళాడు. లోపల నవ్వారు మంచం మీద తీరిగ్గా బాసిపట్టు వేసుక్కూర్చుని మళ్లీ దాన్ని పరిశీలించడం మొదలెట్టాడు.
అరేయ్ ఇది పెలుద్దాంరా మళ్లీ అన్నాను. ఇందాక నవ్వుతాడా వీడిక్కూడా కరంటు షాక్ కొట్టించాల్సిందే అనే కోపంతో. ఇది నిజంగా పేలేదే ఐతే ప్లగ్గులో వైరు పెట్టడం ఎందుకురా ఇదిగో ఈ బ్యాటరీ కి కన్నక్ట్ చేసినా పేలాలి అన్నాడు. బాంబు రెండు కొసల్నీ బ్యాటరీ ప్లస్సు మైనస్సు దగ్గర పెడితే చాలు పేలతాయి అన్నాడు. వద్దురా పేలుతుంది అన్నాను. దీనికంత సీను లేదురా ఇదేమీ పేలదు లే అన్నాడు. అంటూనే బ్యాటరీని కనక్ట్ చేసేసాడు.
ఢాం..మ్మ్..మ్మ్
గుయ్య్..య్..య్..య్..య్..య్..య్..య్
1
2
3
4
శీతాకాలంలో పొద్దున్నే పొలాల్లో చూస్తే అంతా మంచుతో కప్పేసి ఉంటుంది. పదడుగుల దూరం లో ఏముందో చెప్పలేము. మాది కూడా అదే పరిస్థితి. కాసేపు ఏమీ కనిపించలేదు. ఆ కాసేపు ఏమీ వినిపించలేదు కుడా. ఇద్దరం కిందకెళ్ళి మొహం కడుక్కున్నాము. అమ్మమ్మ గదిలోకెళ్ళి కూర్చున్నాము.
అహ్హహ్హహ్హహహ్హహహ్హహ్హ అంటూ పడీ పడీ నవ్వుకున్నాం.
అంత కన్నా ఇంకేమి చేయలేము కదా.
ఐతే OK..